
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. జగన్నాథుని రథయాత్ర అనగానే లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. రథాన్ని లాగేందుకు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున రథయాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. రథం శ్రీ గుడించా ఆలయానికి సమీపంలోకి రాగానే జరిగిన ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. మరో పది మందికి పైగా గాయపడ్డారు. జగన్నాథుడి రథయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో జన సమూహాన్ని నియంత్రించడం అక్కడి సిబ్బందికి కష్టంగా మారింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా ఖుర్దా జిల్లాకు చెందినవారేనని తెలుస్తోంది.
పూరీ జగన్నాథ రథయాత్ర దేశంలోని అతిపెద్ద మతపరమైన తీర్థ యాత్రలలో ఒకటి. ఈ క్రమంలోనే దీనికి అధికారులు సైతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహించారు. ఒడిశా పోలీసులతో పాటు.. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌కు చెందిన దాదాపు 10,000 మంది సిబ్బందికి విధులు కేటాయించారు. అలాగే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. అయినా సరే.. పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులను నియంత్రించడం అధికారులకు కష్టతరంగా మారింది. ఈ రథయాత్ర తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్రగా పేర్కొంటారు. ఈ బహుదా యాత్ర జూలై 5న జరుగనుంది. శనివారం రథయాత్ర ప్రారంభంలో కూడా తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలోనూ 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
పూరి రథయాత్ర తొక్కిసలాటపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే కఠిన చర్యలకు పూనుకుంది. పూరి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ, డీసీపీ విష్ణు పాటి, కమాండెంట్ అజయ్ పాధిని సస్పెండ్ చేసింది. అలాగే మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయాన్నిసైతం ప్రకటించింది.
