Site icon Bhakthi TV

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి (సెప్టెంబర్ 24) నుంచి అక్టోబర్ 2 వరకూ జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారి తరపున సేనాధిపతి శ్రీ విష్వక్సేనులు నాలుగు మాడ వీధుల్లో ఊరేగి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, పుట్టమన్నులో న‌వధాన్యాలను నాటుతూ వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేశారు. అంకురార్పణ విశిష్టత ఏంటంటే.. వైఖానస ఆగమంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. విత్తనాల మొలకెత్తడం శుభప్రతీకం. ఉత్సవాలు విజయవంతంగా సాగాలని సంకల్పించడంతో పాటు, స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

సూర్యాస్తమయం తరువాతే… జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని సస్యకారకుడు అంటారు. అందుకే పగటివేళ విత్తనాలు నాటరాదు. సూర్యాస్తమయం అనంతరం శుభముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ వేళ నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి, దాంతో ఉత్సవాలు సాఫల్యంగా జరుగుతాయని విశ్వాసం. అంకురార్పణలో భాగంగా.. మధ్యాహ్నం విత్తనాలను నీటిలో నానబెడతారు. యాగశాలను ఆవుపేడతో అలంకరించడం, బ్రహ్మపీఠం ఏర్పాటు చేయడం. అగ్నికుండం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ దేవతలను ఆహ్వానించడం. భూమాతను ప్రార్థిస్తూ పాలికల్లో మట్టిని నింపి, చంద్రుని ప్రార్థిస్తూ విత్తనాలు చల్లడం. పాలికలకు నూతన వస్త్రాలతో అలంకారం చేసి పుణ్యాహవచనం చేయడం. సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పారాయణం. ప్రతిరోజూ పాలికల్లో నీరు పోస్తూ వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య కార్యక్రమం కొనసాగింది.

Share this post with your friends
Exit mobile version