
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెప్పోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. విద్యుద్దీపాల నడుమ తెప్పలు చూడ ముచ్చటగా ఉన్నాయి. దీనిలో భాగంగా రెండవ రోజైన గురువారం స్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది.
ఈ తెప్పోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. తెప్పోత్సవాల్లో భాగంగా పాలు, పెరుగు, తెనే, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 7 చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఆగష్టు 08న అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం రాత్రి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి 09 రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులను ఆశీర్వదిస్తారు.
