
తమిళనాడు నామక్కల్‌లోని దేవాలయానికి సుమారు 1500 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఉన్న నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్ల ఎదురుగా హనుమాన్ ఆలయం ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నామక్కల్ హనుమాన్‌గా ఈ ఆంజనేయుడు ప్రఖ్యాతిగాంచాడు. రెండు చేతులు జోడించి లక్ష్మీ నృసింహ స్వామి, సాలగ్రామం వైపు తిరిగి నమస్కరిస్తున్న భంగిమలో ఆంజనేయుడు ఉంటాడు. నామక్కల్ దుర్గాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఈ కోటకు ఇరువైపులా గుహలుంటాయి.
కోటకు ఇరువైపులా ఉన్న గుహలలో నరసింహ స్వామి, రంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ విగ్రహాలను కొండరాయితో మలిచారు. అందుకే నేటికీ ఇవి చెక్కు చెదరలేదు. ఈ కొండలలో ఎనిమిది కొలనులు.. వాటిలో విరిసిన తామర పువ్వులు ఉండడం విశేషం. ఈ ఆలయంలో ఉదయం 8:00 గంటలకు కలసంధి , మధ్యాహ్నం 12:00 గంటలకు ఉచికల పూజ, సాయంత్రం 6:00 గంటలకు సాయరక్ష , రాత్రి 8:45 గంటలకు అర్ధజామ పూజ నిత్యం నిర్వహిస్తారు. ప్రతి ఆచారానికి అలంకారం, నైవేద్యం, దీప ఆరాధన అనే మూడు దశలు ఉంటాయి. తమిళనాడులోని నామక్కల్ జిల్లా నుంచి సేలంకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది. దీనికి తమిళనాడులోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి రవాణా సౌకర్యం ఉంటుంది.
