తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న తిరుపత్తూరులోని బ్రహ్మపురీశ్వర ఆలయ ప్రాంగణంలో 12 శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాలను బ్రహ్మ ప్రతిష్ఠించి పూజించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక తీర్థం ఉంటుంది. దానిని బ్రహ్మతీర్థంగా పేర్కొంటారు. బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన శివలింగాలలో చాలా వరకూ బ్రహ్మ తీర్థం చుట్టూ ఉన్న ప్రత్యేక ఆలయాలలో ప్రతిష్ఠించి ఉంటాయి. బ్రహ్మ తీర్థం అనే దానిని శివునికి అభిషేకం కోసం బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర పుష్కరిణి అని అంటారు.
బ్రహ్మపురీశ్వర మందిర ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవ సమాధిని సైతం మనం దర్శించుకోవచ్చు. ఇక్కడకు వచ్చిన భక్తులంతా శివుడు, బ్రహ్మ దేవుడిని దర్శించుకుని.. పతంజలి మహర్షికి నిత్య పూజలతో అంజలి ఘటిస్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడు.. పరమేశ్వరుని గురించి తపస్సు చేసి స్వామివారి అనుగ్రహంతో తన తలరాతను మార్చుకున్న అనంతరం బ్రహ్మకు శివయ్య ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు తమ విధిరాతను మార్చాలని సూచించాడట. అందుకే ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ తలరాతలు మారుతాయని భక్తులు విశ్వసిస్తారు.
