
ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు, ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన భక్తులు గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయించబడుతుంది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ పెడతారు.
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లో రూ.500 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపి శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు లక్కీ డిప్ లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి మాత్రం వారు చెల్లించిన రూ.500 డిపాజిట్ టీటీడీ తిరిగి చెల్లించదు. పైగా అంగప్రదక్షిణకు అనుమతించదు.
