Site icon Bhakthi TV

తిరుమలలో అనధికారికంగా నివసించే వారిపై కొరడా ఝుళిపించిన టీటీడీ

టీటీడీ సివిఎస్‌వో శ్రీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్‌, భద్రతా సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో ఆదివారం తిరుమలలోని బాలాజీ నగర్‌ వెనుక భాగంలో ఉన్న కార్మికుల నివాసాలపై దాడులు నిర్వహించారు. గతంలో తిరుమలలో వివిధ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేసిన కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లను వారి నివాసం కోసం ఏర్పాటు చేశారు. అయితే, తిరుమలలో పనులు పూర్తయినప్పటికీ, కాంటాక్టర్ వెళ్లిపోయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ 70కి పైగా షెడ్లలో తిరుమలలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇందులో కొంతమంది అనధికార వ్యక్తులు కూడా ఉన్నారు. తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్ అధికారులు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో కార్మికుల జాబితాను ధృవీకరణ కోసం ఇంజినీరింగ్ విభాగానికి పంపించారు. అనధికారికంగా ప్రవేశించే వారిని నిలువరించేందుకు ఇకపై ఇలాంటి దాడులు నిరంతరాయంగా నిర్వహింపబడతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కావున తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వ్యక్తులు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలియజేస్తోంది.

Share this post with your friends
Exit mobile version