Site icon Bhakthi TV

అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ నూతన చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర అన్న ప్రసాదం కార్యాకలాపాలను చైర్మన్‌కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒకరోజులో ఎంతమంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు, అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్న ప్రసాద భవనం పని చేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు.

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రాధాన్యత అని టీటీడీ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు తెలియజేశారు. ప్రమాణస్వీకారం అనంతరం బుధవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. తాను చిన్నప్పటి నుండే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినని, ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భక్తులకు సేవ చేసేందుకు మీడియాతో సహా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు.

Share this post with your friends
Exit mobile version