Site icon Bhakthi TV

తిరుమల అన్నదానం కాంప్లెక్స్‌లో కార్మికుల సమస్యేంటంటే..

తిరుమలలో వ్యవస్థ ఇప్పుడిప్పుడే మారుతోంది. హోటళ్ల తనిఖీ నుంచి దుకాణాల్లో అమ్మే వస్తువులు, శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం, భక్తులకు జల ప్రసాదం, అన్న ప్రసాదం విషయం సహీ ఇతర విషయాల్లో టీటీడీ ఈవో శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే తిరుమల అన్న ప్రసాద భవనంలో పని చేసే కార్మికులు రెండు నెలలుగా జీతాలు అందడం లేదట. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులకు తెలియజేశారు. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో విధులు నిర్వహించే ఎఫ్ఎంఎస్ కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందలేదని గురువారం నాడు టీటీడీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా సంబంధిత కార్మికులతో జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ.. సిబ్బంది జీతాలు సదరు బ్యాంకు ద్వారా వారి కాంట్రాక్టర్ కు గత వారమే పంపడం జరిగిందన్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ కార్మికుల జీతాలు పంపడం జరిగిందని, ఈరోజు రెండవ బ్యాచ్ కార్మికుల జీతాలు కూడా వారి అకౌంట్లలో వేయడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా అన్న ప్రసాదం కార్మికులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ విధుల విరామ సమయంలోనే అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం వారు యథావిధిగా తమ విధులకు హాజరయ్యారు.

Share this post with your friends
Exit mobile version