Site icon Bhakthi TV

అయోధ్య రామమందిర పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ కలకలం

అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ ఎగరడం ఒక్కసారిగా కలకలం రేపింది. డ్రోన్ ఎగరడాన్ని గమనించిన భధ్రతాధికారులు తక్షణమే దానిని కూల్చివేశారు. అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినా కూడా ఆలయ పరిసరాల్లో డ్రోన్ ఎగరడం ఆందోళనను రేకెత్తించింది. వాస్తవానికి రామమందిర ప్రాంతంలోనే కాకుండా ఆలయ సమీపంలోనూ డోన్లు ఉపయోగించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. యాంటీ డ్రోన్ వ్యవస్థను పరీక్షిస్తున్న సమయంలో ఇది జరిగిందని.. వెంటనే అప్రమత్తమై డ్రోన్‌ను నేలకూల్చినట్టు అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు సైతం కేసు నమోదు చేశారు.

రామాలయం ప్రాంతంలో గందరగోళం సృష్టించేందుకు, పెద్ద సంఖ్యలో భక్తులను చంపేందుకు ఇది ఒక దారుణ కుట్రగా ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ముందుగా యాంటీ బాంబ్ స్క్వాడ్ డ్రోన్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. దానిని పరిశీలించాక ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. ఆలయ భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నూతన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలు నిర్ణయించాయి. ఇక మీదట అయోద్య రామాలయ పరిసరాల్లో డ్రోన్ల నిషేధంపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Share this post with your friends
Exit mobile version