Site icon Bhakthi TV

తిరుమల నంబి సన్నిధిని దర్శించుకున్న శ్రీ మలయప్ప స్వామి

తిరుమలలో 25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు పూర్తయిన సందర్భంగా మరుసటి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు శుక్రవారం సాయంత్రం దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి సన్నిధిని దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం సన్నిధిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

కాలం చెల్లిన విశ్రాంతి భవనాల పునర్నిర్మాణాలకు చర్యలు..

తిరుమలలో కాలం చెల్లిన విశ్రాంతి గృహాల స్థానంలో పునర్ నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో శుక్రవారం అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి సుదర్శన్, గోవర్ధన్, కళ్యాణి, సి-టైప్ క్వార్టర్లు, పద్మావతి ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలను అధికారులతో కలిసి విశ్రాంతి గృహాల తాజా పరిస్థితిని పరిశీలించారు. సాధారణ భక్తుల సౌకర్యార్థం సదరు ప్రదేశాలలో విశ్రాంతి గృహాలను పునర్ నిర్మించడానికి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని సీఈ శ్రీ సత్యనారాయణను ఆదేశించారు.

పరిశీలనలో గుర్తించబడిన సమస్యలు:

సదరు విశ్రాంతి గృహాలన్నీ 6 దశాబ్దాల క్రితం నిర్మించడంతో వర్షాకాలంలో లీకేజీలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. సరైన పార్కింగ్ సదుపాయాలు, విశాల స్థలం లేవు. భవన నిర్మాణాలు పాత పద్దతిలో నిర్మించడం మూలంగా భవనాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. పాత భవణాలలో లీకేజీలు, అపరిశుభ్రత, పార్కింగ్ తదితల అంశాలపై భక్తుల నుండి క్రమం తప్పకుండా టిటిడికి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవణాలను పునర్ నిర్మాణాలు చేయాల్సి ఉందని ఇంజనీరింగ్ అధికారులకు ఈవో సూచించారు.

Share this post with your friends
Exit mobile version