
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని కీర్తిస్తూ శ్రీతాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనా సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి భారతజాతికి అందించిన మహనీయుడు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అని ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆచార్య వేంకటేశ్వర్లు కొనియాడారు. శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 137వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య వేంకటేశ్వర్లు మాట్లాడుతూ, తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను పరిష్కరించి , శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి శ్రీ ప్రభాకరశాస్త్రి కృషి చేశారని చెప్పారు. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్కను, తొలి తెలుగు పదం నాగబు అని పరిశోధించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన ప్రాచీన సాహిత్యంతోపాటు కథలు, కథానికలు కూడా రచించారని వివరించారు.
ప్రముఖ సాహితీవేత్త డా.రాజశేఖర్ మాట్లాడుతూ, ఉన్నతమైన సాహితీ విలువలను, యోగ మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన ప్రతి క్షణాన్ని గ్రంథోద్థరణ కోసమే వెచ్చించారని పేర్కొన్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ రాజగోపాలరావు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్య రంగాల్లో విస్తృతంగా పరిశోధన చేసి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి టీటీడీకి గర్వకారణమని చెప్పారు. తన రచనలతో సమాజాన్ని ఎంతగానో చైతన్యపరిచారని తెలిపారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి టిటిడికి అందజేశారని వివరించారు. విద్యార్థులు ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిశోధనాంశాలుగా మార్చుకోవాలని సూచించారు.
