
తిరుమలలో ఇప్పుడు పక్కా ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం కాబోతోంది. 2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అయితే అది అమలు జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది. 2019లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ఎవరికి తెలియని పరిస్థితి ఉందని చెబుతున్న టీటీడీ ప్లాన్ ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదని చెబుతోంది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు జరగడం లేదంటున్న టీటీడీ.. ఇక నుంచి తిరుమలలో కట్టిన నిర్మాణాలు వేటికీ కూడా సొంత పేర్లు ఉండకూడదని తీర్మానించింది.
అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు గానూ మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది.ఈ క్రమంలోనే తిరుమలలో మల్టిలెవల్, స్మార్ట్ పార్కింగ్, పుట్ పాత్ లు నిర్మాణం చేయనుంది. తిరుమలను ప్రణాళికాబద్దమైన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దనుంది. తిరుమల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం సైతం దృష్టి సారించింది. టీటీడీలో అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పాత కాటేజీలన్నింటినీ తొలగించనుంది. మరో 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందించనుంది. దీనికోసం నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారులను సలహాదారులుగా నియమించనుంది.
