Site icon Bhakthi TV

ఇకపై శ్రీవారి భక్తులకు అదనంగా లడ్డూలు తీసుకోవచ్చా? లేదా?

దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో మాట్లాడుతూ, దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్‌తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్‌లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు.

సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదనపు ఈవో తెలియజేశారు. ఇకపై శ్రీవారి భక్తులకు అదనంగా లడ్డూలు తీసుకోవచ్చా? లేదా? అనే విషయంపై అదనపు ఈవో క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు శ్రీవారి లడ్డూలు పొందవచ్చన్నారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 48 నుంచి 62 నంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చన్నారు. అయితే దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో వలే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చన్నారు. టోకెన్స్ లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూ తో పాటు 4-6లడ్డూలను కొనుక్కోవచ్చు.గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది. దీనిని అరికట్టేందుకు గురువారం నుంచి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్‌పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

Share this post with your friends
Exit mobile version