Site icon Bhakthi TV

వేడుక‌గా బంగారు గొడుగు ఉత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం గురువారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగింది. అక్టోబరు 11వ తేదీ శుక్రవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. ఇందుకోసం ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి కి అప్పగించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో మొట్టమొదటి మంగల‌ కట్ట (కళ్యాణ కట్ట)ను ఏర్పాటుచేసి యాత్రికులకు తలనీలాలు సమర్పించుకునే వసతి కల్పించిన పంతులు గారి వంశస్థులు వంశపారంపర్యంగా శ్రీవారి రథానికి గొడుగు సమర్పించ‌డం ఎంతోకాలంగా ఆచారంగా వ‌స్తోంద‌న్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా కొనసాగిందని చెప్పారు. 1946వ సంవత్సరంలో పంతులు గారి వంశస్తులైన ధర్మకర్త శ్రీ శివరామయ్య, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందం మేరకు కళ్యాణకట్టను టీటీడీకి అప్పగించార‌ని తెలిపారు.

అప్పట్లో జరిగిన ఒప్పందం మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో పంతులుగారి వంశస్థులు బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి రథానికి బంగారు గొడుగు ప్రతిష్టించే ఆచారం కొనసాగుతోంద‌న్నారు. పంతులు గారి వంశస్తులైన శ్రీ శివరామయ్య కుమారుడు శ్రీ రామనాథన్ గత 40 సంవత్సరాల నుండి బంగారు గొడుగులకు పూజలు నిర్వహించి కళ్యాణకట్ట నుండి నాలుగుమాడ గుండా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి రథానికి సమర్పిస్తున్నార‌ని, ఇది ఆయ‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని చెప్పారు. కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన శ్రీ పంతులుగారి రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు.

Share this post with your friends
Exit mobile version