
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించుకునే వారిలో అన్ని రకాల ప్రజాలు ఉంటారు. స్వామివారి దర్శనానికి సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రములు సైతం వస్తుంటారు. వారిని చూసేందుకు ఇతర భక్తులంతా ఎగబడుతుంటారు. సెల్ఫీలు దిగాలని ఆరాపడుతుంటారు. ఇది సర్వసాధారణమే. అయితే ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి ముగ్గురు సాధారణ భక్తులు వచ్చారు. వారిని చూసేందుకు ఇతర భక్తులు తెగ ఆసక్తి కనబరిచారు. వారిని చూసి అవాక్కయ్యారు.
సాధారణ భక్తులను చూసేందుకు ఇతర భక్తులు ఎందుకంత ఆసక్తి కనబరిచారు.. అంటారా? వారు సామాన్య భక్తులే కానీ ఒంటి నిండా మాత్రం కిలోల కొద్దీ బంగారం వేసుకుని మరీ వచ్చారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఒంటినిండా బంగారం ధరించిన ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ వారితో పాటు ఒక బాలుడు వచ్చారు. ముఖ్యంగా ఒకరి మెడలో అయితే కిలోల కొద్దీ బంగారం ఉంది. మెడ నిండా బంగారు చైన్లు.. చేతి నిండా బంగారు కవచాలు ధరించారు. దాదాపు 20 కేజీల బంగారాన్ని ధరించి పూణేకు చెందిన సన్నీ వాగచోరీ సంజయ్ గుజర్ కుటుంబం శ్రీమలయప్ప స్వామివారిని దర్శించుకుంది. గోల్డ్ మ్యాన్, ఉమన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు తెగ ఆసక్తి కనబరిచారు.
