
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 8న గరుడ సేవను తిలకించడానికి విచ్చేసే అసంఖ్యాక యాత్రికులను వాహనానంతరం సురక్షితంగా తరలించడంలో భాగంగా టీటీడీ ఇవాక్యులేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే విషయాన్ని సోమవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన బ్రహ్మోత్సవ ఏర్పాట్ల సమీక్షలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, అక్టోబరు 8న గరుడసేవ దర్శనం పూర్తయిన తర్వాత నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలలోని భక్తులను సురక్షితంగా వారి సమీప బస్టాండ్ ప్రదేశాలను చేరుకునేందుకు వీలుగా టీటీడీ విజిలెన్స్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ భక్తులను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు చేరే ఏర్పాట్లు చేస్తారన్నారు. భక్తులకు తాము ఉన్న గ్యాలరీలకు దగ్గరగా ఉన్న బస్టాండు ప్రదేశాలు చేరేందుకు వీలుగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. అనంతరం ఆయన సాంస్కృతిక కళా బృందాల కార్యక్రమాలు గురించి చర్చించడంతో పాటు వాహన ఊరేగింపు సమయంలో గోశాల అధికారుల ఆధ్వర్యంలో నడిచే రధ, గజ, తురగ ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులకు సూచించారు.
