Site icon Bhakthi TV

శ్రీవారి ఆలయంలో జరిగే పర్యంకాసనం గురించి తెలుసా?

కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంలో నిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో పర్యంకాసనం గురించి తెలుసా? ఎప్పుడూ విన్నట్టు లేదే అనుకుంటున్నారా? పర్యంకాసనం అంటే ఏంటో కాదు.. ఏకాంతసేవ. శ్రీవారి ఆలయంలో రోజులో చివరిగా జరిగే సేవే.. ఏకాంతసేవ. ఆగమ శాస్త్రంలో దీనిని పర్యంకాసనం, శయనాసనం అని కూడా అంటారు. మొదటగా స్వామివారి సన్నిధిలో మూలవిరాట్, ఇతర దేవతామూర్తులకు రాత్రి తోమాలసేవలో అలంకరించిన పుష్పమాలలను సడలిస్తారు.

ఆ తరువాత బంగారు పట్టె మంచం తీసుకొచ్చి ఆనందనిలయం ముందు ఉన్న శయన మండపంలో వెండి గొలుసులతో వ్రేలాడదీసి పట్టుపరుపు, దిండ్లు అమర్చుతారు.

శయనమండపంలో ముగ్గు వేసి దీపాలు వెలిగిస్తారు. పర్యంకాసనంలో 5 ఉపచారాలు ఉంటాయి. అవేంటంటే..

మృగనాభి తాంబూలం (కస్తూరి సువాసనతో)
గంధం
పుష్పం
ప్రదక్షిణ
నమస్కారం

ఈ సేవకు భక్తురాలు తరిగొండ వెంగమాంబ వంశీయులు మంచం చుట్టూ రంగవల్లులు వేస్తారు. ఈ సేవనంతా భోగశ్రీనివాసునికి చేస్తారు. అయితే ధనుర్మాసం 30 రోజులలో భోగశ్రీనివాసుని స్థానంలో వెండి కృష్ణమూర్తికి ఈ సేవ జరుగుతుంది. ఆ సమయంలో గరుడ మండపం వద్ద సన్నాయి మేళం మ్రోగుతుంది. పోటువారు వేడి ఆవుపాలు తీసుకొస్తారు.

Share this post with your friends
Exit mobile version