Site icon Bhakthi TV

తిరుమలలో విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ బాగా పెరిగింది. గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ నిర్వహించారు. ఈ క్రమంలోనే సాధారణ భక్తులకు దర్శనానికి దాదాపు మూడు గంటలకు పైనే పట్టింది. ముఖ్యంగా గురువారం సాధారణంగా 65 వేల లోపు మందికి మాత్రమే శ్రీ మలయప్ప స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. కానీ భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోని అన్ని విభాగాలనూ సమన్వయం చేస్తూ మరో పది వేల మందికి పైగా దర్శనం కల్పించుకునే వీలును కల్పించడం జరిగింది.

దీంతో తొలిసారిగా గురువారం రోజున 72,579 మంది శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా విశేష కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందిని అదనపు ఈవో అభినందించారు. మరోవైపు భక్తులు దర్శనం కోసం వేచి ఉండే క్యూ లైన్లలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులకు సరిగా ఆహారం, టీ, పాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీశారు. ఈ క్రమంలోనే టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుంచి వెంకయ్య చౌదరి అభిప్రాయ సేకరణ చేశారు.

Share this post with your friends
Exit mobile version