
భగవంతుడికి ఫలమో.. లేదంటే ఏదైనా ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడం సర్వ సాధారణం. శ్రీనివాసుడికి లడ్డూ, చక్కర పొంగళి, దద్దోజనం వంటి నైవేద్యాలను పెడతారు. అలాగే అయ్యప్ప స్వామికి నెయ్యి, శ్రీకృష్ణుడికి వెన్న ఇలా సమర్పిస్తూ ఉంటారు. ఇక ఓ దేవాలయంలో మాత్రం షాకింగ్‌గా భగవంతుడికి మంచ్ చాక్లెట్‌ను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి చాక్లెట్‌ను నైవేద్యంగా సమర్పించడం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. అసలు మంచ్ చాక్లెట్ పేరు మీదుగానే ఆ భగవంతుడికి మంచ్ మురుగన్ అనే పేరు వచ్చింది. మంచ్ మురుగన్ ఆలయం కేరళలో ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భక్తులకు సైతం స్వామివారి ప్రసాదంగా మంచ్ చాక్లెట్‌ను భక్తులకు ప్రసాదంగా అందిస్తున్నారు.
కేరళలోని శ్రీ చమ్మోత్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బాల మురుగన్ ఉంటాడు. ఆయనకు మంచ్ చాక్లెట్‌ను నైవేద్యంగా పెట్టే పద్ధతి ఆరేళ్ల క్రితం ఆరంభమైంది. వాస్తవానికి ఒకసారి ఓ బాలుడు మురుగన్ ఆలయంలో ఆడుకుంటూ గంట కొట్టగా.. తల్లిదండ్రులు తిట్టారట. ఆ రోజు రాత్రి ఆ బాలుడికి తీవ్ర జ్వరం వచ్చిందట. ఆ సమయంలో రాత్రంతా మురుగన్ పేరును కలవరిస్తూనే ఉన్నాడట. తెల్లవారే బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు ఆలయాలనికి వచ్చారట. వారిని ఆలయ పూజారి ఏమైనా స్వామివారికి సమర్పించాలని కోరగా ఆ బాలుడు మంచ్ చాక్లెట్ ఇచ్చాడట. వెంటనే బాలుడు జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నాడట. అప్పటి నుంచి బాల మురుగన్‌కు మంచ్ చాక్లెట్ ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను తులాభారం పెట్టి వారి బరువుకు సమానమైన మంచ్ చాక్లెట్‌లను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.
