
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆ ఆలయానికి చెందిన అపారమైన ధనం సంపద కారణంగా కొంతకాలం క్రితం వార్తల్లో నిలిచింది. అయితే అంతటి ధనిక ఆలయం కానప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో కూడా చారిత్రక ప్రసిద్ధమైన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. దాని కథేంటో తెలుసుకుందాం. గుహాలయాలుగా ప్రసిద్ధి చెందిన అతి ప్రాచీనమైన ఆలయం ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో ఉంది.
విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారిపై కొద్దిగా ముందుకు వెళితే ఉండవల్లిలో శ్రీ అనంతపద్మనాభ స్వామి గుహాలయాలు వెలసి ఉన్నాయి. క్రీ.శ 420 -620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని విష్ణుకుండినులు పాలించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న గుహాలయాలన్నీ నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతాన్ని అనుసరించేవారు. అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక గుహాలయాలే కదా అని కొట్టిపడేయలేం. వాటి నిర్మాణ కౌశలం చూస్తే వావ్ అనాల్సిందే.
