Site icon Bhakthi TV

జుట్టులేని కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదు?

జుట్టు లేని కొబ్బరికాయ కొట్టకూడదని చెబుతారు ఎందుకు? పిలక లేని కొబ్బరికాయను కొడితే దోషమా? లేదంటే దీని వెనుక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? తెలుసుకుందాం. భక్తి మార్గాలు తొమ్మిది విధానాలు. దీనిలో చివరిది ఆత్మ నివేదనం. అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం. అందుకే పూజ చేసిన తరువాత కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు. కొబ్బరికాయలోని ప్రతిదీ మన శరీరానికి లింక్ అప్ అయి ఉంటుందని చెబుతారు. కొబ్బరికాయ మన శరీరానికి.. కాయ పైనుంచి ఉండే పొర చర్మం.. పీచు మాంసం.. గట్టిగా ఉండే కొబ్బరి చిప్ప ఎముకలు.. కొబ్బరి మనిషిలోని ధాతువు. కాయలోని నీళ్లు ప్రాణాధారం.

కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు.. ఇడ, పింగళ, సుషుమ్న నాడులుగా చెబుతారు. జుట్టు అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక అని చెబుతారు. మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించు కోవాలి కాబట్టి పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొట్టడం దోషమని చెబుతారు. త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి, అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణగాథ.

Share this post with your friends
Exit mobile version