కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టమని చెబుతారు. ఓంకారం ప్రభవించిన రోజు శనివారమని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మలయప్పస్వామికి సంబంధించి శనివారం నాడు ఎన్నో విశేషమైన కార్యాలు జరిగాయి. శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో.. వారిని పీడించనని శనిశ్వరుడు వేంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజుగా శనివారాన్ని పేర్కొంటారు. శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు కూడా శనివారమని చెబుతారు.
శ్రీనివాసుని భక్తులు మొట్ట మొదట సారి దర్శించిన రోజు కూడా శనివారం కావడం విశేషం. ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారమని చెబుతారు. శ్రీ శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారంగా పేర్కొంటారు. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారమని చెబుతారు. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహ మాడిన రోజు శనివారంగా పేర్కొంటారు. కనుక శ్రీనివాసునికి శనివారమంటే అంత ప్రీతి. కాబట్టి మనం శ్రీనివాసుడిని శనివారం నాడు పూజిస్తే సత్ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
