Site icon Bhakthi TV

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెపుతూ ఉంటారు. ఎందుకంటే.. జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు , ఏరు దాటాల్సి వచ్చేవారు… ఈ కాలంలో కాళ్లూ , చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం , గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఆ ఇబ్బందుల్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు.

పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు , మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా , గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

Share this post with your friends
Exit mobile version