
భారతీయ సంప్రదాయంలో వివాహ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులను కలిపే వేడుక మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను కలిపే సంప్రదాయం. ఇక పెళ్లికి ముందు జరిపే ఆచారాల్లో హల్దీ వేడుక ఒకటి. ఈ వేడుకలో భాగంగా వధూవరులకు ముత్తైవుదువులంతా పసుపును పూస్తారు. ఒకప్పుడు దీనిని ఏదో సింపుల్‌గా కానిచ్చేవారు కానీ ప్రస్తుత తరుణంలో మాత్రం ఈ వేడుకను వివాహం జరిపినంత గొప్పగా జరిపిస్తున్నారు. దీనికి కూడా బంధువులంతా హాజరవుతున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగుతున్న ఈ ఆచారం వెనుక మనకు తెలియని రహస్యాలెన్నో ఉన్నాయి.
పసుపు అనేది సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా ఒక ఔషధంగానూ ఇది పని చేస్తుంది. పైగా శుభకార్యాలన్నింటిలో దీనిదే పైచేయి. పసుపు శుభానికి చిహ్నం. పసుపును ఆయుర్వేదం, వేదాలలో ‘హరిద్ర’ అని పిలుస్తారు. అంటే శుద్ధి, రక్షణకు చిహ్నమని అర్థం. వధువు లేదంటే వరుడు శరీరానికి వివాహ తంతులో భాగంగా పసుపును రాస్తారు. పసుపు రాయడమంటే మనసును శుద్ధి చేయడానికి సంకేతం. ఇప్పుడంటే హల్దీ వేడుక కోసం సింహాసనం లాంటి కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు కానీ అప్పట్లో నేలపై కూర్చోబెట్టేవారు. వధూవరులు పాత దుస్తులను ధరిస్తారు. ఆ దుస్తులతో హల్దీ వేడుకలను నిర్వహించినప్పుడు మరకలు వాటిపై పడుతూ ఉంటాయి. పసుపును రాయడం వలన వధూవరుల చర్మ సౌందర్యం ప్రకాశవంతంగా మారడంలో సహాయపడుతుంది.
