
శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది భార్యలున్నారు. ఈ విషయమై కన్నయ్యను నిందించేవారు కూడా లేకపోలేదు. అసలెందుకు పదహారు వేల మంది భార్యలనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే దీని వెనుక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉందని చెబుతారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడని చెబుతారు. త్రేతా యుగంలో ఏకపత్నీవ్రతుడిగా శ్రీరాముడి అవతారం ఎత్తిన విష్ణుమూర్తి.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తాడు. మొత్తంగా శ్రీ మహావిష్ణువు పదో అవతారమే శ్రీకృష్ణుడి అవతారం.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి 16వేల మంది భార్యలు ఉండడం వెనుక ఉన్న పౌరాణిక రహస్యమేమిటంటే.. ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించే నరకాసురుడు 16,100 యువతులను అపహరించి తన కారాగారంలో బంధించాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని వధించాడు. ఆ రోజునే మనం దీపావళి జరుపుకుంటాం. అయితే నాటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం.. రాక్షసుడి బంధీలో ఉన్న మహిళలను కుటుంబంలోకి అనుమతించరు. ఈ క్రమంలోనే తమను రక్షించిన కన్నయ్యతో వారంతా “కృష్ణా! నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మేము అపవిత్రులమవుతాం, దయచేసి మమ్మల్ని భార్యలుగా స్వీకరించండి” అని వేడుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కన్నయ్య వారందరినీ భార్యలుగా స్వీకరించాడని చెబుతారు.
