
ఒకరు కాదు.. ఇద్దరు ముస్లిం రాజులు మధుర శ్రీకృష్ణుడి ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నారు. శాలివాహన శకం 1070 సంవత్సరంలో గజినీ మహమ్మద్, 1670 సంవత్సరంలో ఔరంగజేబు.. ఇరువురూ ఈ ప్రాచీన ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆలయంలోని వెండి, బంగారం సంపదనంతా దోచుకుపోయినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. అంతేకాకుండా ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన ప్రదేశంలోనే షాహి జామా మసీదును నిర్మించాడు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక ప్రస్తుతం శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఈ మసీదు పక్కనే నిర్మించారు.
జామా మసీదుకు దక్షిణంగా శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల కేంద్రంగా దాని చుట్టూ నిర్మించిన ఆలయమే కేశవదేవ ఆలయం. చెరసాల గది ఉన్న ప్రదేశాన్ని గర్భ గృహ మందిరంగా పేర్కొంటారు. విశాలమైన వరండాతో కూడిన పాలరాతి సభా మండపం.. దాని కింద భూగర్భ చెరసాల గది కూడా ఉంటుంది. అష్ట భుజాలతో కూడిన కన్నయ్య మందిరం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భాగవత భవనంలో ఆరడుగుల రాధాకృష్ణుల విగ్రహం, కుడివైపు బలరామ, కృష్ణ, సభద్రలు, ఎడమ వైపున సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడు కొలువై ఉన్నారు. ఇక ఆలయ గోడలపై శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించిన ఘట్టాలు చెక్కబడి ఉంటాయి.
