Site icon Bhakthi TV

అష్టైశ్వర్యాలలో ఏది ఎందుకంటే..

అష్టైశ్వర్యాల గురించి తెలుసుకున్నాం కదా. వాటిలో రాజ్యం గురించి కూడా తెలుసుకున్నాం. మిగిలిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ధనం: ప్రస్తుత తరుణంలో ధనం ఉంటేనే ఎవరికైనా విలువ. అదే ధనం మీదగ్గర లేనప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలు దక్కడం కష్టం. జీవితంలో అతి ముఖ్యమైన కూడు, గూడు, బట్ట ఉండాలంటే ధనం తప్పనిసరి. డబ్బే లేని నాడు ఇవేవీ మీ చెంతకు రావు. అంటే ధనమే అన్నింటికి మూలమన్న సత్యాన్ని గ్రహించాలి.

ఇల్లాలు: సంసార జీవితంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ.. కష్టసుఖాలు పాలుపంచుకొంటూ భర్తకు కొండంత ధైర్యాన్నిచ్చేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. అందుకే పెద్దలు ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. అర్థం చేసుకునే ఇల్లాలు ఉంటే జీవితం ఆనందంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

సంతానం: కొండంత సంపద ఉండి చివరి రోజుల్లో బాగోగులను చూసుకోవడానికి సంతానం లేకపోతే జీవితానికి సంపూర్ణత చేకూరదు. పిల్లలు చేతికొచ్చా రంటే తల్లిదండ్రులకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. సంతానం ప్రయోజకు లయ్యారంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు.

ధైర్యం: జీవితంలో కొందరు సాధించిన దాన్ని మరికొందరు సాధించ లేరు. అలా జరగడానికి ఒక కారణం మీలోని ధైర్య సాహసాలు. జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించ లేక కొందరు మధ్యలోనే వెనుకంజ వేస్తారు. మరి కొందరు ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేసి విజయం సాధిస్తారు. సరైన సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి నప్పుడు డబ్బు కూడా మీ దరికి చేరుతుంది.

ఆత్మస్థైర్యం: మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఒకానొకసారి మిమ్మల్ని బలవంతుల్ని చేస్తే, మరొకసారి బలహీనుల్ని చేస్తోంది. బలహీనమైన సందర్భంలో మీలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేదే మీ మనుగడను నిర్దేశిస్తుంది. కొందరు గెలుపోటములను లెక్క చేయకుండా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అదే సందర్భంలో మరికొందరు ఓటమి కలిగినప్పుడు కుంగుబాటుకు లోనవుతారు.

విద్య: విద్య కలిగిన వాడు విద్యావంతుడు అవుతాడు. సమస్త విషయాలపై జ్ఞానాన్ని సంపాదిస్తాడు. చదువు సరిగా రాకపోతే ఇతరులకు మీరు సరిగా దిశానిర్దేశం చేయలేరు. ఉద్యోగం రావాలన్నా, ఆధునిక సమాజంలో బతుకు బండిని నెట్టుకు రావాలన్నా… విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సంపాదనను దొంగిలించొచ్చు.. పేరు, ప్రఖ్యాతులు నాశనం చేయవచ్చు. కానీ మీ దగ్గర ఉండే విద్యను ఎవరూ దొంగిలించ లేరు. అందుకే విద్య అనేది దొంగిలించలేని ఐశ్వర్యం. ‘విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే’ అని అంటారు.

వినయం: మానవుడు జీవితంలో విజయం సాధించాలంటే వినయం కూడా అవసరం. వినయాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రదర్శించినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది. వినయంగావినడం,మాట్లాడటం,ప్రవర్తించడం, నేర్చుకోవడం వంటివి మిమ్మల్ని బలవంతులను చేస్తాయి.

Share this post with your friends
Exit mobile version