Site icon Bhakthi TV

రామాయణ, మహాభారతాల్లోనూ సనకసనందనాదులు ఎక్కడ కనిపిస్తారంటే..

సనకసనందనాదులు బాల్యంలోనే వేదాలను ఔపోసన పట్టేశారు. బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు. బ్రహ్మచారులై లోకసంచారం చేస్తూ, తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట. నిష్మల్మషమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థని దాటి ఎరుగవు. కానీ వృద్ధులైనవారికి సైతం ఆధ్మాత్మిక రహస్యాలను అందించగల జ్ఞానవృద్ధులు. నారదుడు, మార్కండేయుడు వంటి మహారుషులు సైతం వీరి నుంచి బోధను గ్రహించినవారే. ‘అజ్ఞానానికి అహంకారమే మూలం’ అంటూ పృధు చక్రవర్తికి బోధించినా, ‘ఆత్మ ఒక్కటే సత్యం’ అంటూ దృతరాష్ట్రుని మనసుని తేటపరచినా… అది సనకసనందనాదులకే చెల్లింది.

భాగవత పురాణం ప్రకారం వీరు భగవంతుని లీలావతారాలలో భాగం. ఇక రామాయణంలోని ఉత్తరకాండలో సనకసనందనాదులు రాముని కలుసుకునే సన్నివేశం కనిపిస్తుంది. మహాభారతంలో అయితే జ్ఞానబోధకులుగా వీరు పలుమార్లు కనిపిస్తారు. ఇలా సనకసనందనాదులు గురించి పురాణాలలో ఏవో ఒక ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి. అటు విష్ణుసంబంధమైన సాహిత్యంలోనూ, ఇటు శైవ సాహిత్యంలోనూ వీరి గురించి ఏవో ఒక గాథలు వినిపిస్తూనే ఉంటాయి. శివుడు దక్షిణామూర్తిగా అవతరించినప్పుడు, ఆయన జ్ఞానాన్ని పరీక్షించదలచిన సనకసనందనాదులు అనేక క్లిష్టమైన ప్రశ్నలను వేశారట. కానీ పరమేశ్వరుడు వాటన్నింటినీ అలవోకగా జవాబులనివ్వడంతో… సనకసనందాదులు వినమ్రతగా తమ ఓటమిని అంగీకరించారట.

మన దేశంలోని పుణ్యక్షేత్రాలకు సంబంధించిన స్థలపురాణాలలో కూడా సనకసనందనాదులతో ముడిపడిన కథలు కనిపిస్తాయి. ఉదాహరణకు మానససరోవరం గురించిన కథనే తీసుకోండి. సనకసనందనాదులు పరమేశ్వరునికి పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా వారి తండ్రి బ్రహ్మదేవుడు మానససరోవరాన్ని సృష్టించాడని ఓ గాధ ప్రచారంలో ఉంది. హిమాలయాల దాకా ఎందుకు సనకసనందనాదులు కొన్నాళ్లు తిరుమలలో తపస్సు చేసుకున్నారని చెబుతూ… వారు తపస్సు ఆచరించిన చోటుని సనకసనంద తీర్థంగా పేర్కొంటున్నారు. ఇలా సనకసనందనాదుల ప్రస్తావనలు హైందవ ధర్మంలో అడుగడుగునా కనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధానికీ, భక్తితో కూడిన జ్ఞానానికీ, వైరాగ్య భావనలకీ, నిష్కల్మష జీవితానికీ ప్రతీకగా నిలుస్తారు.

Share this post with your friends
Exit mobile version