Site icon Bhakthi TV

ఎప్పటి త్రేతా యుగ రాముడు? అయినా మన మాటల్లో చేతల్లో ఆయనే..

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంత వరకూ రాముడు మన దిన వారీ చర్యల్లో మనవెంట నడిచిన దేవుడు. మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన – ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన – అద్దం – రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు. ఆదర్శాలు రూపుకడితే రాముడు.. అందం పోగుపోస్తే రాముడు.. ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడు.. మంత్రమూర్తి రాముడు. పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు.

ఎప్పటి త్రేతా యుగ రాముడు? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి? అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట – ‘శ్రీరామరక్ష సర్వజగద్రక్’. బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -‘రామాలాలీ – మేఘశ్యామా లాలీ’.. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట –

“అయ్యో రామా”! వినకూడని మాట వింటే అనాల్సిన మాట – ‘రామ రామ’. భరించలేని కష్టానికి పర్యాయపదం -‘రాముడి కష్టం’. తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – ‘రాముడు’. కష్టం గట్టెక్కే తారక మంత్రం – ‘శ్రీరామ’. విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – ‘శ్రీరామ శ్రీరామ శ్రీరామ’. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాల్లో.. నిత్యం మన మాటల్లో రాముడు స్మరణకు వస్తూనే ఉంటాడు.

Share this post with your friends
Exit mobile version