
రాముల వారు బంగారు లేడీ రూపంలో ఉన్న మారీచుడిని వెదుక్కుంటూ బయలుదేరారు. ఆ తరువాత లక్ష్మణ రేఖ గీసి లక్ష్మణుడు సైతం అన్న కోసం వెళ్లాడు. అదే అదనుగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. సందేహించిన రామలక్ష్మణులు పరుగు పరుగున కుటీరం వద్దకు వచ్చారు. అప్పటికే సీతమ్మ కనిపించలేదు. అసలు సీతమ్మ ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? అనేవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. లంకలో సీతాదేవి జాడను కనుక్కుని వచ్చి హనుమంతుడు చెప్పే వరకూ ఎవ్వరికీ తెలియలేదు. ముందుగా సుగ్రీవుడు వీరికి ఒక రూట్ మ్యాప్ చెప్పాడట.
సీతాదేవి జాడ వెతుక్కుంటూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వతం వైపు వెళ్లగా అక్కడ సుగ్రీవుడు, అతని వానర సైన్యం కనిపించారు. రామయ్య, సుగ్రీవులు ఒకరి కష్టాలు మరొకరు చెప్పుకున్నారు. అలా వాళ్ల మధ్య మైత్రి కుదిరి సీతాన్వేషణ ఎలా కొనసాగించాలనేది వానర సైన్యంలోని ప్రముఖులకు సూచించాడు. అంతేకాకుండా రూట్ మ్యాప్ మొత్తం చెప్పాడు. ఎక్కడ కొండలు, గుట్టలున్నాయో మొత్తం వివరించాడు. అది విన్న శ్రీరాముడు.. ఈ భూమండలం గురించి సుగ్రీవుడికి ఇంత గొప్ప జ్ఞానం ఎలా లభించిందోనని విస్తుబోయాడు. అదే విషయాన్ని అడుగుతాడు. తాను చెప్పిన వివరాలన్నీ ఊహించి చెప్పినవి కావని, ఆ ప్రాంతాలన్నీ తాను గతంలో తిరిగానని సుగ్రీవుడు తెలిపాడు.
