
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఇవాళ మనం దత్త జయంతిని జరుపుకోనున్నాం. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పూజ నిర్వహించుకోవడానికి చాలా బాగుంది. ఈ రోజు ఇంట్లో పూజ నిర్వహించుకున్న మీదట దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. అలాగే ఈ రోజున ఆలయాల్లో అన్నదానం చేస్తే విశేష ఫలితం ఉంటుందట. దత్తాత్రేయ స్వామి వెంట ఎప్పుడూ నాలుగు కుక్కులు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలకు చిహ్నమని చెబుతారు. అందుకే దత్త జయంతి నాడు కుక్కలకు ఆహరం వేస్తారు.
దత్త జయంతి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణాలు దత్తాత్రేయుడి గురించి చెబుతున్నాయి. ఆయా పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమట. దత్తాత్రేయుడు మరెవరో కాదు.. అత్రి మహర్షి, అనసూయ దంపతుల వర పుత్రుడు. దత్తాత్రేయుడు మూడు తలలు, ఆరు చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలతో మనకు కనిపిస్తాడు. ఆయన వెంట ఎప్పుడూ నాలుగు శునకాలు మనకు కనిపిస్తాయి. అలాగే గోమాతతో కూడిన దత్త స్వరూపం కూడా మనకు అద్భుతంగా అనిపిస్తుంది. గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించేనట్టేనట. కాబట్టి దత్త జయంతి నాడు ఒక్క దత్తాత్రేయుని పూజిస్తే త్రిమూర్తులతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందట.
