Site icon Bhakthi TV

స్త్రీలు గాజులు ధరించడం వెనుక కారణమేంటి?

ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా… ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది.
ఎంత పేదింటి అన్నయినా… చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు… ఓ పదో, పరకో చేతిలోపెట్టి… గాజులేయించకోమ్మా’ అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ ఉంటారు.

గాజులు తాము పగలకుండా, మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే. గాజుల ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. గాజులు ఒక్క స్త్రీ కే కాదు, పూర్వ కాలంలో పురుషులు కూడా ధరించేవారట. రాను, రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది. స్త్రీ మంచి చీరకట్టుకొని , ఎన్ని నగలు మెడలో ధరించినా , చేతులకు గాజులు లేవంటే అందమనేది రాదు కదా? గాజులు ధరించడం అనే సాంప్రదాయం.. పుట్టిన పిల్లల నుండి వస్తున్నదే కదా ? ఎలా అంటారా ? పుట్టిన బిడ్డలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు.

అది కేవలం దిష్టి కోసమే కాదు , ఆ గాజుల నుంచి వచ్చే సవ్వడులు, పసిపిల్లలను పలకరించి వారిలో బోసినవ్వులను పూయిస్తాయట. గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుందట. ఎలా అంటే గాజులు ఎంత సున్నితం గా ఉంటాయో, గాజులు ధరించిన స్త్రీ అవి పగల కుండా సున్నితం గా నడుస్తుంది , అలాంటి నడకవలన , నడవడిక మారుతుందట..చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్ష్యాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుందట. గాజులు అందంతో పాటుగా స్త్రీ సౌభాగ్యం ప్రతిబింబిస్తుంది. అందుకే గాజులు పగులకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

Share this post with your friends
Exit mobile version