
గ్రహణ కాలంలోనూ.. కొన్ని పూజా సమయాల్లోనూ దర్భలను తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. గ్రహణం వస్తోందంటేనే ముందుగా దర్బలను సేకరిస్తాం. కనీసం ఎందుకు వాడుతున్నామనే అవగాహన కూడా లేకుండా వాడుతూ ఉంటాం. అసలు దర్బలను ఎందుకు వాడాలి? గ్రహణ సమయంలో తులసి, దర్భలు, బిల్వదళములు ఉన్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. దర్బ మొక్కలు అనేవి ఒక విధమైన గడ్డి జాతికి చెందినది. శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది.
ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. ఇవి జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విష క్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి ఉంచడం మనం చేస్తుంటాం. దర్భలని సంస్కృతంలో ‘అగ్ని గర్భం’ అంటారు. కుంభాభిషేకాలలోను యాగశాలలోని కలశాలలోను, బంగారు, వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు. దర్బాలను పవిత్ర గడ్డిగా భావిస్తారు. హిందూ సంస్కృతిలో పూజలు, యజ్ఞాలు వంటి శుభకార్యాలలో తప్పనిసరిగా దర్భను ఉపయోగిస్తారు. పూజా సమయంలో దర్భ గడ్డిని వేలికి ఉంగరంలా ధరిస్తారు. అలాగే పీఠాలు, పవిత్ర స్థలాలలోనూ దర్భను వినియోగిస్తారు.
