
గౌరీకుండానికి పార్వతీదేవి, గణేశుడితో సంబంధం ఉందని.. అదేంటో కూడా తెలుసుకున్నాం కదా. కేదార్‌నాథ్‌కి 16 కి.మీ దూరంలో ఈ గౌరీకుండం ఉంటుంది. దీనిలో రెండు నీటి కొలనులుంటాయి. ఆసక్తికరంగా ఒకదానిలో వేడి నీరు, మరో దానిలో చల్లటి నీరు ఉంటాయి. ఈ నీటిలో ఔషధ గుణాలున్నాయని చెబుతారు. అలాంటి ఔషధ గుణాలున్న నీటిలో స్నానం చేయడం వలన చాలా వ్యాధులు నయమవుతాయని స్థానికులు నమ్ముతారు. అంతే కాకుండా హిందూ విశ్వాసాల ప్రకారం గౌరీకుండంలో స్నానమాచరిస్తే.. భక్తులు తమ పాపాలన్నింటినీ వదిలించుకుంటారు.
గౌరీకుండంలో స్నానం చేయడం వలన వ్యాధులు నయమవడంతో పాటు పాపాలన్నీ తొలగిపోవడమే కాదు.. శారీరక, మానసిక శుద్ధి కూడా జరుగుతుందట. అలాగే పార్వతీదేవి ఆశీస్సులు సైతం లభిస్తాయని చెబుతారు. ఈ ప్రదేశం పార్వతి దేవి తపస్సు చేసిన ప్రదేశం కనుక ఈ గౌరీకుండంలో స్నానం చేసిన వ్యక్తిపై పార్వతి దేవి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. ఇక్కడ స్నానమాచరిస్తే కేదార్‌నాథ్ ప్రయాణం కూడా విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం. గౌరీకుండంలో స్నానమాచరించిన మీదటే కేదార్‌నాథ్‌కు వెళ్లడం ఈనాటి సంప్రదాయం కాదు.. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నారు.
