
ఏపీలోని కర్నూలులో యాగంటి ఉమా మహేశ్వర ఆలయం గురించి తెలుసుకున్నాం. ఈ ఆలయంలోని నందీశ్వరుడు ప్రతి 20 ఏళ్లకోసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతుంటాడు. ఈ ఆలయంలోని నందీశ్వరుడు రంకె వేశాడంటే.. కలియుగ అంతం తప్పదట. ఈ శివాలయం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఈ శివాలయాన్ని అగస్త్య మహర్షి నిర్మించాడని చెబుతారు. అగస్త్య మహర్షి ఇక్కడ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని భావించాడట. అయితే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం బొటనవేలు విరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోక అగస్త్య మహర్షి శివుడిని ఆరాధించాడు.
అప్పుడు అగస్త్యుని ఎదుట ప్రత్యక్షమైన శివుడు ఆ ప్రదేశం కైలాసాన్ని తలపిస్తోందని కాబట్టి అక్కడ తన ఆలయాన్ని నిర్మించాలని చెప్పాడట. శివుడు చెప్పిన మాట మేరకు అగస్త్యుడు అక్కడ శివాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇక్కడ ఎప్పుడూ కూడా కాకులు కనిపించవు. దీనికి కూడా అగస్త్యుడే కారణమని చెబుతారు. అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో కాకులు ఆయనను వేధించడంతో కోపోద్రిక్తుడైన ఆయన ఈ ప్రాంతంలో ఎప్పటికీ మీరు ప్రవేశించలేరని కాకులకు శాపం ఇచ్చారట. అగస్త్యుడు శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసిన ప్రదేశం అగస్త్య గుహ అని నమ్ముతారు. ఈ ప్రాంతంలో వేంకటేశ్వర గుహ కూడా ఉంది. ఈ గుహలోని వేంకటేశ్వర స్వామివారి విగ్రహం తిరుపతిలోని విగ్రహం కంటే పెద్దదట.
