Site icon Bhakthi TV

21న శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష.. నాడు తిరుమలలో ఏం జరగనుందంటే..

జూలై 21వ తేదీ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు.

ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుంచి చిన్నజీయంగారు, శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టీటీడీ ఈఓ, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ‌శ్రీ‌శ్రీ‌ చిన్నజీయంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు.

Share this post with your friends
Exit mobile version