
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నికి చెందిన దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. స్నానాలని అయిదు విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధానాలు. అవి
నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.
నైమిత్తిక స్నానం : ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం.
ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, శ్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.
కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం.
ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.
