Site icon Bhakthi TV

అసలేమిటి జయమంత్రం.. ఎప్పుడు ఎవరు పఠించారు?

జయమంత్రం పఠిస్తే ఎలాంటి కష్టం నుంచి అయినా బయటపడతామని తెలుసుకున్నాం కదా. జయమంత్రం ప్రాధాన్యతను వివరించే ఒక కథ తెలుసుకుందాం. దశరథ మహారాజు మునుపెన్నడో కైకేయి ఇచ్చిన వరాలను శ్రీరామ పట్టాభిషేకానికి సరిగ్గా ఒక్క రోజు ముందు కోరుకున్న విషయం తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలా? లేదంటే మాట తప్పాలా? ఏం చేయాలో పాలుపోని స్థితిలో దశరథ మహారాజు తల్లడిల్లిపోతాడు. తండ్రి బాధను అర్థం చేసుకున్న శ్రీరాముడు ఆయనకు నచ్చజెప్పి సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్తాడు. అరణ్యవాసంలో అష్టకష్టాలు పడిన రాముడు చివరకు రావణాసురుడు వచ్చి సీతను అపహరించుకొని వెళ్లాక ఆగ్రహం.. సీతా వియోగంతో తీవ్ర ఆవేదనకు గురవుతాడు.

వానర రాజు సుగ్రీవుని సహాయంతో నలుదిక్కులా దూతలను పంపించి సీతాన్వేషణ గావిస్తాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుకు వెళ్లి సీతమ్మ జాడ కనుక్కొని శ్రీరాముడి దు:ఖాన్ని తగ్గించాడు. ఈ భాగం సుందరకాండలో వివరించారు. శ్రీరాముని, లక్ష్మణుని, సుగ్రీవుడిని, కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం జయ మంత్రం! కాబట్టి జయమంత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని నియమనిష్టలతో పఠిస్తే ఆపదలు తొలగిపోయి, హనుమ అనుగ్రహంతో కష్టం నుంచి బయటపడతాం.

Share this post with your friends
Exit mobile version