Site icon Bhakthi TV

దుర్గ నామంలోని ‘గ’ కారం దేనికి సంకేతం?

దుర్గ నామంలో ‘ద’కారం దైత్యనాశనానికి, ‘ర’కారం రోగనాశనానికి ‘గ’ కారం జ్ఞానానికి సంకేతాలని తెలుసుకున్నాం కదా. రాక్షస లక్షణాలను ‘ద’ కారం నాశనం చేస్తుందని కూడా తెలుసుకున్నాం. అలాగే పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుందట. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు.. దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానక రోగాలు. ఇలాంటి రోగాలన్నీ మనిషినే కాకుండా.. మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గ నామంలో ఉండే ‘ర’కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.

ఇక ‘గ’ కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కాదట. సమస్త బ్రహ్మాండాలను తన సంకల్ప మాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరి. మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుసుకునే పని ఉండదో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో.. అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరం కాదు, శరీరాన్ని ధరించిన ఆత్మ స్వరూపులమనే అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి దుర్గ అన్న నామమే పరమ శక్తివంతమైనది.

Share this post with your friends
Exit mobile version