Site icon Bhakthi TV

పంచభూతాత్మకుడు, త్రయంబకుడు అంటే అర్థమేంటంటే..

పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదా.. ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే – జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం. ఆదిగురువు శివుడు అన్న విషయం తెలిసిందే. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించాల్సి ఉంటుంది. అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను శోధించాలి. పంచభూతాత్మకుడు, త్రయంబకుడు అంటే ఏంటో తెలుసుకోవాలి.

పంచభూతాత్మకుడు : శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.

త్రయంబకుడు : శివుని మూడుకన్నులు కాలాలను (భూత, భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞా చక్ర స్థానములో ఉండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

విభూతిదారుడు: సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు, నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.

Share this post with your friends
Exit mobile version