Site icon Bhakthi TV

హనుమంతుని గొప్పదనం ఎంతంటే ఏం చెబుతారు?

ఆంజనేయుడు రామనామ చింతనా స్వాంతుడు. రామ పాదారవింద సేవా భాగ్యవంతుడు. ఏ చిత్రపటంలో చూసినా రాముని పాదాల చెంత ముకుళిత కరకమలాలతో కూర్చొని దర్శనమిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముడు రక్తి.. ముక్తి వంటి వాటిని కోరలేదు. నిరంతరం రామసేవలో తరించాడు.
‘ఈ రోజు ఏం తిథి?’ అని హనుమను ఎవరో అడిగితే ‘తిథులు, వారాలు నాకు తెలియవు. రామనామం ఒక్కటే తెలుసు’ అన్నాడట. ఆ రామనామ స్మరణతోనే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. వానరులలో ఎవ్వరూ కనుక్కోలేని సీతమ్మ జాడను తెలుసుకొని లోకోత్తర కార్యాన్ని సాధించగలిగాడు. అదీ భగవత్‌ సేవ అంటే! అందుకే రామానుగ్రహం పొంది భవిష్యత్‌ విధాత అయ్యే అవకాశానికి నోచుకున్నాడు ఆంజనేయుడు.

పరాక్రమంలో హనుమకు సాటి వచ్చే వారు లేరు. ‘న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్‌’ అంటాడు హనుమ. అంటే వేయి మంది రావణులైనా తనకు ఎదురు నిలబడలేరని అర్థం. తాను ఎంతటి శక్తిమంతుడైనా, దానికంతటికీ కారణం రామనామ మహిమే అని చాటి చెప్పాడు. నిరంతరం రామ నామాన్ని చాటడమే హనుమ అభిమతం. అందుకోసమే యయాతికి ఆశ్రయమిచ్చి రామబాణం కన్నా రామనామమే గొప్పదని లోకానికి తెలియజేశాడు. తానే దేవుడై ఉండి ఆంజనేయుడు ఒక సాధకుని అవతారం ఎత్తి, సాధకుడైన వాడు కార్యాన్ని ఎలా సాధించాలో, భక్తుడైనవాడు భగవంతుని సేవకు జీవితాన్ని ఎలా సంపూర్ణంగా, నిస్వార్థంగా సమర్పించాలో లోకానికి చాటిచెప్పాడు పవన సుతుడు. అంతటి మహానుభావుడి గొప్పదనం ఎంతంటే ఏం చెబుతాం.. ఎంత చెప్పుకున్నా తరగనిది.

Share this post with your friends
Exit mobile version