Site icon Bhakthi TV

వాక్కు ఎలా ఉండాలని ఆర్యాశతకంలో సుందరపాండ్యుడు చెప్పాడు?

విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవునికి ప్రసాదించిన అమూల్యమైన వరం వాక్కు. ఈ వాగ్భూషణమే మానవుణ్ణి మహనీయునిగా తీర్చిదిద్దుతుందని పండితులు చెబుతారు. పశుపక్ష్యాదులకు లేని ఈ వరం మనకు లభించింది కాబట్టి, ప్రతి ఒక్కరూ వాక్కును సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం మాత్రం ఎప్పుడూ చేయరాదు. ప్రియమైన వాక్కు – సంతోషాన్ని పంచుతుంది. పరుష వాక్కు – హృదయాలను గాయపరుస్తుంది. సుందరపాండ్యుడు ఆర్యాశతకంలో హెచ్చరిస్తూ.. “ప్రియమైన మాటలతో అందరినీ ఆనందింపజేయాలి.. కఠిన వాక్కులు పలకరాదు.” అని హితవు పలికాడు.

యుద్ధంలో ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి. విషం ప్రాణాన్ని హరిస్తుంది. అగ్నిఝ్వాలలు శరీరాన్ని దహనం చేస్తాయి. కానీ ఇవన్నిటికన్నా భయంకరంగా, పరుష వాక్కులు ప్రతి క్షణం మనసును దహింపజేస్తాయి.

న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః
పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥

కఠినంగా మాట్లాడేవారికి ఆప్తులు దూరమవుతారు. సన్మార్గి – అన్యమార్గి, చిన్న – పెద్ద అనే తేడా లేకుండా, అన్ని కాలాల్లోను, అన్ని ప్రాంతాల్లోను మనోవేదన కలిగించేది పరుష వాక్కే. పాముకాటు, విషప్రయోగం ప్రాణాన్ని ఒక క్షణంలో తీసేస్తాయి. కాని పరుష వాక్కుల గాయం..

ప్రాణం తీయకపోయినా ప్రశాంతంగా ఉండనివ్వదు, ప్రతి క్షణం పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం: పుల్లవిరుపు మాటలను విడనాడుదాం.

వ్యంగ్యోక్తులను త్యజిద్దాం. ప్రియవాక్కుతో జీవితం పుష్పమయం, పరుషవాక్కుతో జీవితం నరకమయం అవుతుందని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version