Site icon Bhakthi TV

సీతను రావణుడు అపహరించినప్పుడు మండోదరి ఏం చేసింది?

మయాసురుడనే రాక్షసుడు గొప్ప శిల్పి. అతడికి మయబ్రహ్మ అని పేరు కూడా ఉంది. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి, సుగుణవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంట పడుతుంది. మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అయితే.. ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి, ఆమెను రావణుడు వివాహం చేసుకుంటాడు. వలచి మరీ మండోదరిని పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడసాగాడు.

ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది. రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రావణుడిపై రాముడు యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందురోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి. యుద్ధంలో చివరకు రావణుడు మరణించాడు.

Share this post with your friends
Exit mobile version