Site icon Bhakthi TV

రాణులందరి రోగం కుదిర్చేందుకు మాధవుడు ఏం చేశాడంటే..

వందే నంద వ్రజ స్త్రీణాం పాదరేణు మభీక్ష్ణశః
యాసాం హరికథోద్గీతం పునాతి భువన త్రయమ్‌

‘ఏ బృందావన గోపికల కృష్ణకథా గానం మూడు లోకాలనూ పావనం చేస్తోందో, అట్టివారి(గోపికల) పవిత్ర పాద ధూళి ఒక్క రేణువుకు మాటిమాటికీ నమస్కారం’ అని స్తుతించి ఉత్సవమూర్తి అయిన ‘ఉద్ధవుడు’ వారి పాద రజాన్ని ప్రసాదంగా స్వీకరించాడు. నారద మహర్షి తన ‘భక్తి’ సూత్రాలలో.. ‘యథా వ్రజ గోపికానాం’ అని భక్తికి గోపికలనే పరమ, చరమ ఆదర్శంగా పేర్కొన్నాడు. ఆ ప్రేమాభక్తి పొందటానికి ఉద్ధవాది భక్తులు పరితపించారు. గోపికలు ప్రేమ సన్యాసినులు, భక్తి యోగినులు. ‘సాత్వస్మిన్‌ పరమ ప్రేమరూపా’- ఈ ప్రేమా భక్తి (ప్రేమ పూర్వక భగవత్‌ సేవ)నే భక్తి శాస్త్రం ‘పంచమ పురుషార్థం’గా ప్రవచించింది.

గోపికల తనువు, మనువు, ప్రాణం, మానం.. అంతా గోపాలుడే! అందుకే ద్వారకలో 16,100 మంది పత్నులతో, రుక్మిణీ సత్యభామాది అష్ట పట్టమహిషులతో ఉన్నా గోపాలకృష్ణుడు వ్రజగోపికల పట్లే తన్మయత్వం పొందేవాడు. దీని వలన ద్వారకలోని దేవేరులంతా ద్వేషం పూనారు. ‘గోపికల గొప్పేంటి? మా తప్పేంటి?’ అంతఃపురమంతా అసూయతో రగిలిపోతోంది. ‘నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః’ భగవంతుడు భక్తుల్లో కోపం, కపటం, కుళ్లు, కుత్సితం అస్సలు ఓర్వడు. తన రాణులందరికీ ఒకే రోగం. కనుక మందు కూడా ఒకటే. రోగం ఎలా కుదురుతుంది?

పరమాత్మది ఎప్పుడూ పరోక్ష పద్ధతేగా! మాయా మనుష విగ్రహుడు మాధవుడు కూడా తనకొక మాయ రోగం కల్పించుకొన్నాడు. తీవ్రమైన జ్వరం! ఒళ్లు కాలిపోతోంది. ఎవ్వరికీ కాళ్లూచేతులూ ఆడటం లేదు. వైద్యుడొచ్చి మందిచ్చి దానితో పాటు అనుపానం అనివార్యమన్నాడు. అసాధారణమైన అనుపానం.. ఏమిటది? అంఘ్రిరజం! ప్రేమీభక్తుల పాదధూళి! అందర్నీ అడిగారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ‘అమ్మో! ప్రాణనాథునికి పాదధూళితో ఉపచారమా? అపచారం కాదా? ఎంత పాపం! ఇంకేమన్నా ఉందా? నరకానికి పోమూ!’ అంటూ రుక్మిణి మొదలుగా మురహరి పత్నులంతా ముఖం చాటేశారు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version