Site icon Bhakthi TV

కాశీపై ఆగ్రహించిన వ్యాసుడు.. శపించబోయిన శివుడు.. వారించిన పార్వతీదేవి..

ఆతిథ్య వేళ అంటారు. అంటే ఎవరయినా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు. గడప దాటి ఇంటిలోపలకు వచ్చిన అతిథిని ముందుగా “భోజనం చేశారా!” అని అడగాలి. ఆతిథ్య ప్రస్తావన వస్తే కాశీ పట్టణం పేరెత్తకుండా మాట్లడటం కుదరదు. కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 గంటల వేళ ఎవరు అన్నం పెట్టినా అది అన్నపూర్ణమ్మ హస్తమే. అందుకే ఆడవాళ్లు కాశీయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ వడ్డన సేవ చేయాలని కోరుకుంటారు. అటువంటి కాశీ పట్టణంలో అన్నం దొరకలేదని వ్యాసుల వారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. శపించబోయారు. చేతిలోకి నీళ్ళు తీసుకున్నాడు.. “ధనము లేకుండెదరుగాక మూడుతరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును మూడుతరములు లేకుండుగాక, పంచజనులకు కాశీపట్టణమందు” అన్నాడు.

ఇంతలో ఎదురుగుండా ఇంటిలోంచి గడియ తీసుకుని పట్టుచీర కట్టుకుని వచ్చింది ఓ తల్లి. అప్పటికీ లోపలినుంచి శివుడు… “ధూర్తుడు, కాశీని శపిస్తాడట… కాల్చేస్తా’ అంటున్నాడు. శివుడి ఆగ్రహానికి కారణం- ‘కాశీ’ పరమేశ్వ రునికి భార్యలాంటిది. వెంటనే పార్వతీ దేవి అన్నది కదా… “ఆగండాగండి. ఆకలిమీదున్న వాడిని కాల్చకూడదు. తప్పు. అతను అతిథి ” అంటూ గభాల్న తలుపుతీసుకుని వచ్చింది. కోపంతో నీళ్ళుపట్టుకుని ఊగిపోతున్న వ్యాసుడిని పిలిచింది…” వ్యాసా! ఇలా రా! భిక్షలేదని కాశీ పట్టణం మీద ఇంత కోపించడమా, నీ చిత్తశుద్ధి తెలుసుకుందామని పరమశివుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికాపట్టణంలో అన్నం దొరకకపోవడమా? భూమండలంలో ఎక్కడయినా అన్నం దొరకదేమో కానీ కాశీ పట్టణంలో అన్న దొరకకపోవడం అంటూ ఉండదు. ఎందుకంత తొందరపడుతున్నావు? వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చుకునిరా”- అని వ్యాసుడిని, శిష్యులను పిలిచి కూర్చోబెట్టి మధుర మధురమైన వంటకాలను వడ్డించింది.

పాయసం పాత్ర ఎడమచేతిలో పట్టుకుని బంగారు తెడ్డు కుడి చేత్తో పట్టుకుని అన్నపూర్ణమ్మ తల్లి ఎవడొస్తాడా వడ్డిద్దామని ఎదురు చూస్తుంటుంది కాశీలో. ఆడవారి సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడయినా ఎవరికి అన్నం పెడతాడు? ఆతిథ్యమంటే ఆతిథ్యమే. వ్యాసుడిని కూర్చోబెట్టి కడుపునిండా అన్నం పెట్టింది. అప్పుడొచ్చాడు పరమశివుడు. “ఎంత తప్పు చేసావు, కాశీని శపించడమా! వైరాగ్యం కొద్దీ కాశీకి రావాలే గానీ, భోగం కోరేవారు రాకూడదు. కాశీని వదిలి పెట్టి వెళ్ళిపో..” అన్నాడు.

Share this post with your friends
Exit mobile version