Site icon Bhakthi TV

భక్తురాలి శాపానికి బండరాయిగా మారిన విష్ణుమూర్తి.. ఆ కథంటంటే..

హిందూ పురాణాల్లో ఎంతో మంది పతివ్రతలు ఉన్నారు. వారు శపిస్తే దేవుడైనా రాయిగా మారిపోవాల్సిందే. అలా మారిన వారు ఎవరైనా ఉన్నారా? అంటారా? సాక్షాత్తు విష్ణుమూర్తే ఉన్నాడు. ఆ కథేంటో తెలుసుకుందాం. పూర్వం జలంధరుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య పేరు బృంద. ఆమె మహా పతివ్రత. జలంధరునికి ఉన్న వరమేంటంటే.. బృంద పాతివ్రత్యానికి భంగం కలగనంత వరకూ అతన్ని మరణం దరి చేరదు. ఇంకేముంది.. ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగేది లేదు.. మరణం నన్ను దరిచేరేది లేదని గర్వంతో విర్రవీగిపోయాడు. దేవతలను, గంధర్వులను, మహర్షులను విపరీతంగా బాధించాడు.

వారంత శ్రీ మహావిష్ణువు వద్ద తమ బాధను మొరపెట్టుకున్నారు. అయితే అతని వరం గురించి వారికి చెప్పి అతని సంహారం అంత తేలిక కాదని.. కానీ సంహరిస్తానని దేవతలకు అభయం ఇచ్చాడు. ఒకరోజు జలంధరుడు శివునిపైకే యుద్ధానికి వెళతాడు. ఆ సమయంలో శ్రీమహా విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరకు వెళతాడు. తన భర్తే అనుకున్న బృంద విష్ణుమూర్తి పాదాలను స్పృశిస్తుంది. అంతే ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లుతుంది. అక్కడ శివుని చేతిలో జలంధరుడు మరణిస్తాడు. ఇక బృంద ఎదుట విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. యుద్ధంలో భర్త మరణించాడని తెలుసుకుని తన పాతివ్రత్యానికి భంగం కలిగించినందుకు విష్ణమూర్తిని రాయిగా మారిపొమ్మని బృంద శపిస్తుంది. దీంతో విష్ణుమూర్తి రాయిగా మారాడు. విషయం తెలిసి లక్ష్మీదేవి వెళ్లి బృందను వేడుకోవడంతో ఆమె శాపాన్ని విరమించుకుంటుంది. ఇది కథ.

Share this post with your friends
Exit mobile version