Site icon Bhakthi TV

భూలోక వైకుంఠమైన తిరుమలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు..

భూలోక వైకుంఠమైన తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించి దేశంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు పిలుపునిచ్చారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జరిగిన వన మహోత్సవంలో ఈవో, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ప్రదేశంలో తిరుమల ”స్థలవృక్ష”మైన మాను సంపంగి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ ఫారెస్ట్‌ పరిధిలో రెండు వేలు, రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో 10వేలు మొత్తం 12 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.

“సీడ్ బౌల్ కాన్సెప్ట్” అమలు చేస్తూ ఆధునిక సాంకేతికత సహాయంతో ప్లాంటేషన్ కార్యక్రమం శాశ్వతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి ఉన్నందున, ఈ సంస్థలకు అవసరమైన ఔషధ మొక్కలను ప్రత్యేకంగా తిరుమలలోని కాటేజీల సమీపంలో అభివృద్ధి చేస్తాం ”అని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఫారెస్ట్ విభాగం తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వందలాది మను సంపంగి (మాగ్నోలియా చంపాకా), శాండల్ వుడ్ (సంతాలమ్ ఆల్బమ్), సీతా అశోక (సరకా అసోకా) మొక్కలను నాటింది. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూధన్ ప్రసాద్, ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version