
తిరుపతి, 2024 ఆగస్టు 20: టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01 ) గా సేవలందించేందుకు ఎంబీబీఎస్ విద్యార్హత గల అభ్యర్థులకు ఆగస్ట్ 29వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్ లో ఉదయం 11 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాల ఒరిజినల్ , జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను, కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించగలరు. ఇక ఈ నెల 27న శ్రీ కృష్ణ జన్మాష్టమికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం సిద్ధమవుతోంది. జన్మాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపానికి కృష్ణ స్వామివారు వేంచేపు చేయనున్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు బంగారు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి నివేదనలు సమర్పించనున్నారు.
