
ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా, సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో సేవలందించాలని ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకుగాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించామని శ్యామలరావు తెలిపారు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో జారీ చేస్తున్నామన్నారు. తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమలలో భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు హోటల్స్ వారికి అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నామని శ్యామలరావు తెలిపారు.
క్యూలైన్లల్లో, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఆరు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు.
శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కాలంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కొంతమంది మధ్యవర్తులు ఎక్కువసార్లు పొందినట్లు గుర్తించాము. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కావున భక్తులు ఇటువంటి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నామని ఈవో తెలిపారు. శ్రీవారి సేవలో గడిచిన 24 సంవత్సరాల్లో ఇప్పటివరకు 15.70 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొని భక్తులకు విశేష సేవలందిస్తున్నారు.
శ్రీవారి భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో తెలిపారు. టీటీడీ నిబంధనలు పాటించని హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కోనుగొలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తిరుమల స్వచ్ఛతకు మారుపేరు అని.. తిరుమలలో పరిశుభ్రతను మెరుగ్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్‌ఎస్‌డి టోకెన్లను, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.59 లక్షలు ఇస్తున్నాం, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని ఈవో తెలిపారు.
